టీడీపీ కార్యాలయం కూల్చేయాలంటూ ఆళ్ల పిటిషన్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా ఆత్మకూరులో నిర్మితమైన టీడీపీ కార్యాలయ భవనం అక్రమ నిర్మాణమని.. దానిని కూల్చివేసి, ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆత్మకూరు పరిధిలో ఉన్న వాగు పోరంబోకుకు చెందిన సర్వే నెంబరు 392లో 3.65 ఎకరాల భూమిని టీడీపీ కార్యాలయ నిర్మాణం కోసం 99 సంవత్సరాల పాటు లీజుకిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందని.. ఇది అక్రమమని ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందులో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్, జిల్లా కలెక్టర్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తదితరులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.